బాలల దినోత్సవం

Image: Shutterstock

IN THIS ARTICLE

సంతోషానికి ప్రతిరూపాలైన పిల్లల కోసం పుట్టిందే బాలల దినోత్సవం. ఆ బాలల దినోత్సవం నేడే. ప్రతి ఏటా నవంబర్ 14 న ఈ వేడుకను చేసుకుంటాం. ఆ రోజే ఎందుకు చేయాలి?  పిల్లలను అమితంగా ప్రేమించే మన మొదటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రు జన్మదినం ఆ రోజే. ఒక దేశ భవిష్యత్తు, సంపద… ఆ దేశంలో గల పిల్లలే అని నమ్మిన వ్యక్తి ఆయన. మొదట్లో మనం ఐక్య రాజ్య సమితి చెప్పిన విధంగా నవంబర్ 20న బాలల దినోత్సవాన్ని నిర్వహించుకునే వాళ్ళం. 1964లో నెహ్రు మరణించాక ఆయన గౌరవార్ధం ఈ పిల్లల వేడుకను ఆయన పుట్టినరోజున నిర్వహించాలని పార్లమెంటు నిర్ణయించింది. అందుకే ప్రపంచమంతా నవంబర్ 20 న చేస్తే, మనం మాత్రం 14న బాలల దినోత్సవం నిర్వహిస్తాం.

నెహ్రు ని పిల్లలంతా ముచ్చటగా ‘చాచా నెహ్రు’ అని పిలిచేవారు. ఎంత పెద్ద పదవి లో ఉన్నా, ఎన్ని పనుల ఒత్తిడిలో ఉన్నా పిల్లలతో కాలం గడిపేవారు.  నేటి బాలలే రేపటి దేశపౌరులని, వాళ్ళని మంచి మార్గంలో నడిపితే, దేశ భవిష్యత్తును వారే నిర్మిస్తారని నెహ్రు భావించే వారు. వాళ్ళని తీర్చిదిద్దే బాధ్యత తల్లితండ్రులు, గురువులు, సమాజానిదేనని అనేవారు. పిల్లలు మంచి పౌరులుగా ఎదగాలంటే వారికి చదువు అవసరమని ఎన్నో పాఠశాలలు నెలకొల్పారు. సైన్సు లో పురోగతిని సాధించాలని అన్ని స్కూళ్లలో సైన్స్ ల్యాబ్ లు, లైబ్రరీ ఉండేలా కృషి చేశారు. ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే ఇంగ్లీష్ విద్యాభ్యాసం అవసరమని గ్రహించి కాన్వెంట్లను మన దేశానికి పరిచయం చేశారు.

నెహ్రు గురించి కొంచెం

అల్లహాబాద్ లోని మోతీలాల్, స్వరూపరాణి జంటకు 1889లో నెహ్రు జన్మించారు. చిన్నప్పట్నుంచే చాలా చురుకు. ఇంటి వద్దనే సైన్సు ,ఇంగ్లీషు సబ్జెక్టులను అభ్యసించారు .15 ఏళ్లవయసులోనే ఇంగ్లాండ్ వెళ్లి అక్కడ న్యాయ శాస్త్రంలో పట్టా సాధించి, తిరిగి 1912లో మాతృదేశానికి చేరుకున్నారు. అప్పటికే మన దేశంలో స్వాతంత్య్ర ఉద్యమ వేడి రాజుకుంది. జాతీయోద్యమానికి ప్రభావితులై ‘భారత జాతీయ కాంగ్రెస్‍’లో సభ్యునిగా చేరారు. ఉద్యమంలో భాగంగా పలుమార్లు జైలుకు వెళ్లారు. రెండో ప్రపంచ యుద్ధం పూర్తయ్యే నాటికి గాంధీజీ తరువాత దేశానికి మరో శక్తివంతమైన నేతగా అవతరించారు.

నెహ్రు తన కుమార్తెకు రాసిన లేఖలు

జైల్లో ఉన్నంత కాలం తన ఏకైక కూతురు ఇందిర గురించి ఆలోచిస్తూ ఉండేవారు. ఆమెతో సమయం గడపటల్లేదని విచారించేవారు. తన భావాలన్నీ ఉత్తరాల్లో రాసి కూతురుకి పంపేవారు. నెహ్రు నింపిన ఉత్సాహం, ధైర్యంతోనే ఇందిర మొట్టమొదటి మహిళా ప్రధాని గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకుని దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపారు. నెహ్రు తన కూతురికి రాసిన ఉత్తరాలన్నీ  “లెటర్స్ ఫ్రమ్ ఫాదర్ టు డాటర్” పేరుతో పుస్తకంగా అచ్చయి, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాయి.

పిల్లలంటే అభిమానం

జవహర్ లాల్ నెహ్రు ఎక్కడికెళ్లినా చుట్టూ  పిల్లల కోసమే చూసేవారు. వారంటే అంత అభిమానం. ఓసారి ఓ పాపా  తన చేతికిచ్చిన గులాబీ పువ్వు ని కోటుకి పెట్టుకున్నారు. అప్పటినించి అది అలవాటుగా మారిపోయింది.

ఒకసారి జపాన్ కు చెందిన పిల్లలు మన దేశ ఏనుగు కావాలని కోరినట్టు తెలిసి, వాళ్ళ కోసం భారత పిల్లల తరఫున బహుమతి గా ఒక ఏనుగును పంపారు. ఇది రెండు దేశాల మధ్య స్నేహాన్ని పెంచింది.

పిల్లలకు పండుగ

బాలల దినోత్సవం అంటేనే పిల్లలకి ప్రత్యేకమైన పండుగ. పది రోజుల ముందుగానే ఈ సంబరం మొదలై పోతుంది. రక రకాల క్రీడలలో, వ్యాస రచనలలో, వక్తృక్త్వ పోటీలు, చిత్ర లేఖనం, నృత్యాలు, బృంద గానాలు, క్విజ్ లు, నాటకాలు, ఏక పాత్రాభినయాలలో పోటీలు నిర్వహించి, ప్రతిభ ఉన్నవారికి బహుమతులు ఇస్తారు. ఇవి పిల్లల్లో ఉత్సాహాన్ని నింపి, ఆ రంగాల్లో రాణించేలా ఆత్మవిశ్వాసం పెంచుతుంది.  టీమ్ వర్క్ అన్నది ఇక్కడే మొదలవుతుంది. పిల్లలకి ఏయేరంగాల్లో అభిరుచి ఉన్నదో తల్లితండ్రులకి తెలిసే అవకాశం ఉంటుంది.

పిల్లలు మన దేశానికి విలువైన సంపద. వారు మంచి చదువులతో, విజయాలతో రాణిస్తే  ప్రపంచ దేశాల మధ్య మన దేశ పతాకంసగర్వంగా ఎగురుతుంది. అలాకాక చెడు అలవాట్లకు బానిసలై, చదువుని నిర్లక్ష్యం చేస్తే జీవితాలు నాశనమై పోతాయి. పిల్లల్ని సన్మార్గంలో నడిపించే బాధ్యత తల్లితండ్రులు ,గురువులు, సమాజానిదే. ఈ సత్యాన్ని స్పష్టంగా చెప్పిన మొదటి వ్యక్తి మన చాచాజీ. పిల్లలకి మంచి ఆరోగ్యం, విద్య , వినోదం అందించాలని  తాను ప్రధానిగా వున్నప్పుడు ఎన్నో కార్యక్రమాలని రూపొందించారు. పిల్లలకి పోషకాహారం అంది, వారు విద్య ,క్రీడల్లో పైకి రావాలని ఆశించారు.

చాచా నెహ్రు పిల్లల కోసం చెప్పిన కొన్ని మంచి విషయాలు

  1. భయాన్ని పక్కన పెట్టాలి.  నిర్భయం గా నలుగురిలో మాట్లాడటం ,మన భావాలని చక్కగా వ్యక్తీకరించటం చిన్నప్పటినించీ నేర్చుకోవాలి.
  1. భాష మీద చక్కటి పట్టు రావాలంటే, అక్షరమాల బాగా నేర్చుకోవాలి. తప్పు లేకుండా రాయటం, చదవటం రావాలి.
  1. అబద్దాలాడటం అతి పెద్ద దుర్గుణం. దానివల్ల మీకు జరిగే నష్టమే ఎక్కువ. ఇతరులు మిమ్మల్ని త్వరగా నమ్మరు. అందువల్ల సాధ్యమైనంత వరకు అబద్దాలాడరాదు. దీనికి మన పురాణాలు,చరిత్రలో ఎన్నో కధలున్నాయి.
  1. మనుషులంతా సమానమే. రంగు, జాతి, భాష, దేశం ఎన్ని తేడాలున్నా మనుషులంతా ఒకటే. పిల్లలకి ఆ బేధాలు తెలియవు. పిల్లలు ఎదిగాక కూడా అలాగే ఉండాలి.
  1. గొప్ప వాళ్ళ జీవిత కధలు, చరిత్ర చదివి మంచి విషయాలు తెలుసుకోవాలి. మంచి వాళ్ళ ని ఆదర్శంగా తీసుకోవాలి. భారత దేశ చరిత్ర ని నెహ్రు ” డిస్కవరీ అఫ్ ఇండియా” అనే పుస్తకంలో చక్కగా వర్ణించారు. అందరు చదవతగ్గ పుస్తకం ఇది.
  1. విద్యాలయాల్లో ఎన్నో గొప్ప విషయాలు పిల్లలు నేర్చుకుంటారు. ఎంత గొప్ప స్థానానికి ఎదిగినా, గర్వం పనికి రాదు. మానవత్వపు విలువలు మరువరాదు.
  1. పిల్లలు పూదోటలోని పసిమొగ్గల వంటి వారు. చక్కటి పోషణ ,సంరక్షణ కల్పిస్తే ఎదిగి అందంగా వికసిస్తారు. వారే మన జాతి భవిష్యత్తు, రేపటి పౌరులు.

ప్రపంచంలోని పిల్లలందర్నీ ఒక్కచోటకి చేరిస్తే, వారి రూపాలే వేరుగా ఉంటాయి,  ఆటపాటలు, వ్యవహారం ఒకే తీరుగా ఉంటుంది. కల్మషాలు, తేడాలు వారిలో ఉండవు. అంత స్వచ్ఛమైన మనసు కలవారు. పిల్లలు పెరుగుతున్న కొద్దీ వారిలో అమాయకత్వం మాయమై పరిసరాలు, చుట్టూ ఉన్న మనుషుల ప్రభావం పడుతుంది. ఏది ఏమైనా వారిలోని మానవత్వం మాత్రం చివరి వరకు నిలిచే లా చూడాలి.

పిల్లలకి చదువు భారం కాకుండా సరదాగా ఆటలాగా, సబ్జెక్టు పై ఆసక్తి పెంచేలా చెయ్యాలి. వారి బాల్యం ఎంతో హాయిగా గడిపేలా చేయాలన్నది నెహ్రు గారి ఆశయం. చాచా నెహ్రు 128వ జయంతిని పిల్లలకి ఉత్సాహాన్ని నింపే పండుగలా  గడపడం ఎంతో సంతోషం.

మేమంతా ప్రతి సంవత్సరం ఈ రోజు కోసం ఎదురు చూస్తుంటాము. మా బాల్యంలో ఈ దినోత్సవం ఎంతో విలువైనది. మా టీచర్స్ చదువులపైనే కాక ,ఇతర సాంస్కృతిక విషయాల్లో కూడా ఎంతో ప్రోత్సాహాన్నిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు . వారికి మా వందనములు. జైహింద్ !!

The following two tabs change content below.